పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా..! హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అని హరీష్ రావు మండిపడ్డారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. పాలన గాలికి వదిలిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా అని నిలదీశారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు అని పేర్కొన్నారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు అని తెలిపారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని మండిపడ్డారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి గారిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేసారు.