మేము చేస్తున్న మంచి పనులను చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజలపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేసారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేయిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ నేతలకు మా సత్తా ఏమిటో చూపిస్తామని అని జగ్గారెడ్డి అన్నారు. మల్లన్న సాగర్లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, గృహజ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామని, అనేక ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.