నాపై కేసు పెడితే భయపడేది లేదు.. నేను జైలుకెళ్లడానికి సిద్దమే.. కేటీఆర్
ఈస్టిండియా కంపెనీ మెగా ఇంజినీరింగ్ మీద, సుంకిశాలలో గోడ కూలిపోయింది.. ఇంటెక్ షాఫ్ట్ మొత్తం కూలిపోయి 80 కోట్లు నష్టం వాటిల్లింది. మొగోనివే అయితే పంపు ఏసీబీని మెగా కృష్ణారెడ్డి మీదికి పంపు చూస్తా.. దమ్ము ఉందా..? అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నాపై ఎందుకు కేసు పెడతారు?.. హైదరాబాద్ ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా.. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు అని కేటీఆర్ ప్రశ్నించారు.
నాపై కేసు పెడితే నేను భయపడను.. జైలుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానని.. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందితే అందుకు నేను సిద్ధమే అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది?.. మంచిగా యోగా చేసుకుని బయటకు వస్తా… ఆ తర్వాత నేను పాదయాత్రకు సిద్ధమవుతా అంటూ కేటీఆర్ తెలిపారు. ‘టార్గెట్ కేటీఆర్‌పై ఉండకూడదు, ప్రజా సమస్యలపైనే ఉండాలి.. ఏసీబీ నుంచి నాకు నోటీసులు రాలేదు.. పత్రికా నోటీసులే వస్తున్నాయి.. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నాయి అని కేటీఆర్ ఆరోపించారు.