ఆ తప్పు మా టీమ్ సభ్యులు చేయలేదు.. వాళ్ళు ఎవరో నాకు తెలుసు.. అంటూ నాని డైరెక్టర్ ఆగ్రహం
నాచురల్ స్టార్ నానితో తన మొదటి సినిమా 'దసరా' తో శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ తరువాత తన రెండో సినిమా కూడా నానితోనే చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం తన కొత్త సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసిన కొందరు తనకు తెలుసని అన్నారు. తమ టీమ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘నా సినిమాకే కాదు.. ఏ సినిమాకైనా లీకుల సమస్య ఎదురైతే.. అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లను నిందించడం మానుకుంటే బాగుంటుంది.. సినీ రంగానికి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్ వాళ్లు. సినిమా రంగానికి వారు అందించే నిస్వార్థమైన సేవలను ఎంతగానో గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి. 'నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన వ్యక్తులెవరో నాకు తెలుసు. వాళ్లు నా టీమ్‌లోని సభ్యులు కాదు' అని పేర్కొన్నారు. నాని హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు 'ది ప్యారడైజ్' గా నిర్ణయించారు. చితబృందం రివీల్ చేసేలోగా ఆ టైటిల్ లీక్ అయింది.