TGSRTC శుభవార్త.. అక్కడికి వెళ్లాలనుకునే వారికీ ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యం..!
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు హనుమకొండ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును వరంగల్-1 డిపో నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 13న హనుమకొండ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, వెల్లూరు మీదుగా 14న సాయంత్రం 7 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. యాత్ర ప్యాకేజీ టికెట్ ధర పెద్దలకు రూ: 4,500, పిల్లలకు రూ: 3 వేలుగా సంస్థ రుసుం నిర్ణయించింది. ఆసక్తి గలవారు tsrtconline.inలో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.