ఏపీలో సీ ప్లేన్ ట్రయల్ రన్ ప్రారంభం.. సామాన్యులకు అందుబాటు ధరల్లోనే ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సీప్లేన్ డెమో కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. విమానాశ్రయాలు నిర్మించలేని మారుమూల ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటీని పెంచేందుకు సీప్లేన్ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు. కొన్ని మార్గదర్శకాలను మార్చి సామాన్యులకు అందుబాటులో ఉండేలా పథకానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. వచ్చే 3-4 నెలల్లో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీప్లేన్ ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు. ఏపీలో 4 రూట్లలో నడపాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు. అవరోధాలను అధిగమించి, నిపుణుల మార్గదర్శకాలతో ఈ రోజు అమరావతిలో సీప్లేన్ డెమో లాంచ్ చేస్తున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పున్నమి ఘాట్ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. విజయవాడ నుంచి సీ ప్లేన్‌లో సీఎం చంద్రబాబు శ్రీశైలం చేరుకున్నారు.అనంతరం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు.