ఎకరానికి 10 క్వింటాళ్ల సోయా కొనుగోలుకు అనుమతి : ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు
ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున సోయా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జుక్కల్ ప్రాంతంలో సోయాను అత్యధికంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్ కు రూ.4,892 మద్దతు ధర చెల్లిస్తుంది. అయితే ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తోంది. దీంతో రైతులు ఇబ్బంది పడటాన్ని గమనించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఎకరాకు 10 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేయాలని, ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా మొత్తం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జుక్కల్ ప్రాంత సోయా రైతులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.