మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. వైఎస్ జగన్
ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే, మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, చివరకు ప్రజలను మోసంచేస్తాడు. దీనికోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడు అని వైఎస్. జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీ-ప్లేన్ ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదే. సెల్‌ఫోన్ తానే కనిపెట్టానని, కంప్యూటర్లు కూడా తానే కనిపెట్టానని 2 దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు, ఇప్పుడు సీ-ప్లేన్ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. దేశంలోనే తొలిసారి అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా, సీ-ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబుగారి బిల్డప్, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయి. ఓవైపు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ప్రజల సంపదగా నిర్మిస్తూ సృష్టించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ, మరోవైపు దీనిమీద ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ-ప్లేన్‌తో అభివృద్ధి ఏదో జరిగిపోయినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అని అన్నారు.
చంద్రబాబుగారూ… రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెస్తూ, తద్వారా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని తీసుకొస్తూ, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కట్టడం సంపద సృష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం పేరుతో మీ మనుషులకు స్కామ్‌లు చేస్తూ అమ్మాలనుకోవడం సంపద సృష్టి అవుతుందా? అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా, మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజలకోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారు. మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదే. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం రంగంలో మంచి స్కూల్స్ లేకుండా చేసి, మంచి వైద్యాన్ని అందించే మెడికల్ కాలేజీలు లేకుండా చేసి, మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారు అని జగన్ అన్నారు.