దీపావళి పండుగ సందర్భంగా… బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
దీపావళి పండుగ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఆస్థానం జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా బ్రేక్ దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31న తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ప్రత్యక్షంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీనికి సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.నవంబర్‌లో తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నిర్వహించనున్నారు.