For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అజ్ఞానం.. జగన్ పై షర్మిల ఫైర్

02:32 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 02:33 PM Nov 11, 2024 IST
హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అజ్ఞానం   జగన్ పై షర్మిల ఫైర్
Advertisement

అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీరు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ?..అంటూ ఆమె నిలదీశారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే… ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అని షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు అని వాపోయారు.
ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు అని ప్రశ్నించారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే… ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు అని షర్మిల నిలదీశారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం అంటూ వాపోయారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు అని పేర్కొన్నారు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం అని తెలిపారు.
ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు అని తెలిపారు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు అని పేర్కొన్నారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు అని అన్నారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది అని చెప్పారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి అని సలహా ఇచ్చారు. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి.. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి అని షర్మిల మండిపడ్డారు.

Advertisement
Tags :
Advertisement

.