బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని జగన్ ఆరోపించారు. తాజాగా ఆయన బడ్జెట్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పెడితే మోసాలు బయటపడతాయని చంద్రబాబుకు తెలుసు అందుకే బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేశారన్నారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని బడ్జెట్ పత్రాలు తేల్చాయి. బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ తెలుస్తుంది అని అన్నారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు.. ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు. ఆ తరువాత ఒక పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు. అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారుతోందని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేసారు అని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారన్న జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టేందుకే ఈ ప్రచారం చేశారన్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల 13 వేల కోట్లు. 2024లో దిగి వచ్చే నాటికి ఏపీ అప్పులు 6 లక్షల 46 వేల కోట్లు. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19 శాతం పెరిగితే వైసీపీ హయాంలో 15 శాతం మాత్రమే పెరిగిందని జగన్ అన్నారు. అప్పురత్న బిరుదు ఎవరికి ఇవ్వాలని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మహాకూటమి నేతలు దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ సిండికేట్లకు అప్పగించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రయివేటు జేబుల్లోకి వెళుతోంది అని జగన్ నిలదీశారు.