భూములు ఇవ్వకుంటే రైతులను కొడతారా?.. రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే ఇదంతా..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇవాళ రైతులను అరెస్ట్ చేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారా అని కేటీఆర్ వాపోయారు. పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు.. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారు అని తెలిపారు. కొడంగల్ రైతులపై పోలీసులు థార్డ్ డిగ్రీ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి.. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో న్యాయమూర్తి పర్యవేక్షణ లో పరీక్షలు నిర్వహించాలి అని కేటీఆర్ డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసమే ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్ బగ్గుమంటుంటే మొకం చాటేసిన సీఎం రేవంత్ మహారాష్ట్రలో తిరుగుతున్నాడని ఆయన మండిపడ్డారు. అలాగే మా పార్టీ నేత సురేష్‌తో మాట్లాడితేనే నేరమైతే.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అలాగైతే.. దేశాన్ని దోపిడీ చేస్తున్నాడని అదానీని రాహుల్ గాంధీ తిడుతున్నాడు. మరి.. అదే అదానీతో రాసుకుపూసుకు తిరుగుతున్న రేవంత్‌ని సీఎం పోస్టు నుంచి తప్పించాలా? వద్దా? అని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్ పాలన, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.