తెలంగాణ సచివాలయ సిబ్బందికి సీఎస్‌వో కీలక ఆదేశాలు జారీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు..!
తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయంలోని భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలు చేయరాదని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచామని వెల్లడించారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మరియు పోలీసు శాఖకు వ్యతిరేకంగా పోస్ట్‌లను షేర్ చేయవద్దు లేదా లైక్ చేయవద్దు అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో 144 సెక్షన్ (ప్రస్తుతం సెక్షన్ 163) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు నిషేధిస్తూ సీపీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి నవంబర్ 28 వరకు నెల రోజుల పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా బహిరంగ సభలు, ధర్నాలు, నిరసనలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.