మెట్రో ఫేజ్-2.. ఉత్తర హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకోండి
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విన్నవించారు. నగర జనాభాలో 40 శాతం మంది ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నారు మరియు వారందరూ ప్రజా రవాణా వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారు. అలాంటి వారి కోసం మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ మెట్రో ఎండీకి లేఖ సమర్పించారు. ఉత్తర హైదరాబాద్ రీజియన్ మీదుగా ఉత్తర తెలంగాణలోని మేడ్చల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు నిత్యం రాకపోకలు సాగుతున్నాయని మెట్రో ఎండీకి వివరించారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి అధికార ప్రతినిధి సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు.
కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదన :
- బాలానగర్ - షాపూర్‌నగర్ - సూరారం - గండిమైసమ్మ
- బోయిన్‌పల్లి - సుచిత్ర - కొంపల్లి - మేడ్చల్
- జూబ్లీ బస్ స్టేషన్ - అల్వాల్ - తూంకుంట
- తార్నాక - ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ - నాగారం-కీసర