సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిక్కుమాలిన చర్యల వల్ల పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు : కేటీఆర్
కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ఉద్దేశ్యపూర్వకంగా గుడ్డెద్దు చేతుల్లో పడినట్లుగా కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద అర్థం లేకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదలపై ఉసిగొల్పి, నోటీసులు ఇవ్వకుండా మీ ఇళ్లను కూలగొడతామంటూ భయానక వాతావరణాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని ఆరోపించారు. ఎక్కడ తన ఇల్లు కూలగొడతారేమోనని ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. బుచ్చమ్మ కుటుంబాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. బుచ్చమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. హైడ్రా కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే సంస్థతో రేవంత్ రెడ్డి చేసిన హత్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యల వల్ల పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని… ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని… పేదల ఇళ్లను మాత్రం కూల్చివేశారన్నారు. రేవంత్ రెడ్డి అరాచకాల గురించి హైదరాబాద్ లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చిస్తున్నారని వ్యాఖ్యానించారు.