శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్
శారదా పీఠానికి ఏపీ చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. విశాఖలోని శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. ఈ దెబ్బతో వివాదాస్పద స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీకి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.2005 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తిరుమలలోని గోగర్భం రిజర్వాయర్ ప్రాంతంలో శారదా పీఠానికి 5000 చదరపు అడుగుల స్థలాన్ని 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. టీటీడీ నిబంధనలు పాటించి అక్కడ నిర్మాణాలు చేపట్టాలని శారదా పీఠం నిర్వాహకులకు టీటీడీ అధికారులు సూచించారు. అయితే తిరుమలలో శారదా పీఠం నిర్వాహకులు అక్రమ కట్టడాలు నిర్మించారనే ఆరోపణలున్నాయి. టీటీడీ ఇచ్చిన అనుమతులను పాటించకుండా శారదా పీఠం నిర్వాహకులు అక్రమ నిర్మాణాలు చేపట్టినా టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా శారదా పీఠం అక్రమ నిర్మాణం జరుగుతున్నా అప్పటి టీటీడీ బోర్డు సభ్యులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.