తెలంగాణ పోలీసు శాఖ మరో సంచలన నిర్ణయం..పది మంది టీజీఎస్పీ పోలీసులపై వేటు
తెలంగాణ రాష్ట్రంలో టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానాన్ని’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. కాగా, నిరసనలు తెలిపే పోలీసులపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పది మంది టీజీఎస్పీ పోలీసులపై వేటు వేసింది. వీరిని తొలగిస్తూ ఆదివారం (అక్టోబర్ 27) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలో పని చేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళనకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్ 311(2)B ప్రకారం, వారు శాశ్వతంగా విధుల నుండి తొలగించబడ్డారు.సివిల్ పోలీసులతో సమానంగా తమకు కూడా విధులు కేటాయించాలన్న డిమాండ్‌తో ప్రత్యేక కానిస్టేబుళ్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.ఆదివారం కూడా పలు జిల్లాల్లో ప్రత్యేక పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ బెటాలియన్, వరంగల్ జిల్లా టీజీఎస్పీ మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆదివారం నిరసన తెలిపారు.