ఏపీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అమరావతి రైల్వే లైన్ చాలా అవసరం : పవన్ కల్యాణ్
అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని హైదరాబాద్, కోల్‌కతా, చెన్నైలతో అనుసంధానం చేసేందుకు రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. రూ.2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.
ఈ క్రమంలో మొత్తం 57 కిలోమీటర్ల మేర రూ.2,245 కోట్లతో అమరావతి లింక్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అమరావతి రైల్వే లైన్ చాలా అవసరమని అన్నారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ లైన్‌ను కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ మేర వంతెనను కూడా నిర్మిస్తామని, ఈ కొత్త రైలు మార్గం పూర్తయితే దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అమరావతికి కనెక్టివిటీ వస్తుందని పవన్ కల్యాణ్ వివరించారు.