సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో.. లక్షల్లో టోకరా పెట్టిన భార్యాభర్తలు
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.26 లక్షలు వసూలు చేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే..వెంకటగిరి స్రవంతినగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10లో నివాసముంటున్న ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది జనవరిలో అక్కడ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చల్లా శ్రీరామ్ కిరణ్ వాసుతో పరిచయం ఏర్పడింది.
చల్లా శ్రీరామ్ కిరణ్ నాకు పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వాసుని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2-2.5 లక్షల వరకు 17 మంది నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి శ్రీరామకిరణ్‌కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చారని, వీరంతా ఆయా కంపెనీల్లో చేరేందుకు వెళ్లగా.. అవి ఫేక్ ఆఫర్ లెటర్స్ అని తేలింది. అయితే వెంటానే బాధితులు అందరూ కలిసి చల్లా శ్రీరామకిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలను సంప్రదించారు.
అయితే వేరే కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మళ్ళి వారిని నమ్మించారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుడు వాసు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో తమ వద్ద నుంచి రూ.26 లక్షలు కావాలనే వసూలు చేసిన శ్రీరామకిరణ్, అతని భార్య సంధ్యారాణిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఈ మేరకు వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.